తెలుగులో

బహుకాలంగా తానాసంస్థలో కార్యకర్తగా నిర్విరామంగా పనిచేస్తున్న డాక్టర్ జంపాల చౌదరి, మొదటిసారిగా తానా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. 2013-15లో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు (Executive Vice-President and President-Elect)గా పోటీ చేస్తున్నట్టు డాక్టర్ జంపాల చౌదరి ప్రకటించారు.

వృత్తిరీత్యా మానసిక వైద్యుడైన డాక్టర్ జంపాల చౌదరి, ప్రవృత్తిరీత్యా తెలుగు భాషాసంస్కృతుల అభిమాని. 1981నుంచి తానా సభ్యునిగా, 1990 నుంచి జీవితసభ్యుడిగా ఉన్న డా. చౌదరి 1992నుంచి నిర్విరామంగా తానా సంస్థకు స్వచ్ఛందకార్యకర్తగా పని చేస్తున్నారు. మానసిక వైద్యునిగా, ఉపాధ్యాయుడిగా, పరిశోధనవేత్తగా, నిర్వాహకుడిగా తనకున్న అనుభవాన్ని తానా సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం ఉపయోగించే డా. జంపాల చౌదరి ఇప్పటి వరకు తానా సంస్థ కు చేసిన సేవల వివరాలకోసం ఇక్కడ నొక్కండి.

డా. జంపాల చౌదరి తెలుగు, ఇతర సామాజిక సేవ వివరాలకోసం ఇక్కడ నొక్కండి.

నేను 32 సంవత్సరాలుగా తానా సభ్యుణ్ణి. 21 సంవత్సరాలనుండి మన తానా సంస్థకు వివిధ రకాలుగా నేను చేస్తున్న స్వచ్ఛందసేవ మీకు పరిచయమే. అనేక తానా కార్యక్రమాలను రూపకల్పన చేయటం, అభివృద్ధి చేయటం, నిర్వహించటంలో వివిధ తానా కార్యనిర్వహకవర్గాలకు విరామం లేకుండా సాయపడుతూ ఉన్నాను. గత రెండు దశాబ్దాలలో   తానాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన అనేక కార్యక్రమాల్లోపదవి, పేరు అని పట్టించుకోకుండా, నా వంతు పాత్ర నిర్వహించాను. తానా ఎన్నికలలో మొదటిసారిగా పోటీకి నిలుస్తూ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా (Executive Vice President – President Elect) నాకు మీ విలువైన ఓటు వేయమని సవినయంగా అభ్యర్థిస్తున్నాను.

ఇన్నాళ్ళుగా ఎన్నికలకు దూరంగా ఉన్న నేను ఈరోజు పోటీ చేయడానికి ఒక్కటే కారణం: కొన్నేళ్ళుగా మన ప్రియమైన తానా సంస్థ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం మీకు తెలుసు. వేగంగా మారిపోతున్న పరిస్థితులలో తానా సంస్థ మనుగడను, భవిష్యత్తును భద్రపరచుకోవలసిన అవసరం ఇప్పుడు ఉంది. సంస్థ ఆశయాలను, విధానాలను పునరాలోచించుకొని ముందుకు ఎలా సాగాలో నిర్ణయించుకొనవలసిన తరుణం ఇది. అమెరికాలో తెలుగు వారి అవసరాలకు సరైన విధంగా స్పందిస్తూ, సభ్యులందరిని కలగలుపుకొని ఉత్తేజపరుస్తూ సంస్థను పటిష్టం చేయగలిగిన నాయకత్వం ఇప్పుడు కావాలి. చాలకాలంగా తానా వ్యవహారాలను దగ్గరనుండి పరిశీలిస్తున్నాను. అనేకమంది సభ్యులు తానా భవిష్యత్తుగురించి వారి అభిప్రాయాలను నాతో పంచుకొన్నారు.  ఈ అనుభవంతో సభ్యులందరినీ కలుపుకొని, సరైన నిర్ణయాలతో, పథకాలతో తానా భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి ఈ సమయంలో, ఈ పదవిలో నేను సాయపడగలను అనుకోవటమే ఇప్పుడు నేను పోటీ చేయటానికి కారణం.

మీ సహాయసహకారాలతో తానా సంస్థను తెలుగువారందరూ గర్వపడే సంస్థగా తీర్చిదిద్దవచ్చని నా నమ్మకం. ఈ ప్రయత్నంలో నాతో భాగస్వాములై, నాకు వోటు వేసి సహకరించమని కోరుతున్నాను. మీరు నాకు అవకాశం ఇస్తే, తానాకోసం, తానా సభ్యుల సంక్షేమం కోసం, తెలుగు వారందరికోసం, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తికోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.  —  జంపాల చౌదరి

డా. జంపాల చౌదరి వ్యక్తిగత వివరాలకోసం ఇక్కడ నొక్కండి.
డా. జంపాల చౌదరి అందుకొన్న పురస్కారాల వివరాలు ఇక్కడ.
డా. జంపాల చౌదరి వ్రాసిన  కొన్ని వ్యాసాల వివరాలు ఇక్కడ.
డా. జంపాల చౌదరితో పత్రికలు, ఇతర ప్రసారమాధ్యమాలు జరిపిన ఇంటర్వ్యూలు ఇక్కడ.

ఈ-మెయిల్ అడ్రెసు: vcjtana@gmail.com

Advertisements